Current Date: 29 May, 2026

నాకు కాబోయే అల్లుడికి ట్రాఫిక్ చాలానాలు ఉన్నాయా? కాకినాడలో ఓ కుమార్తె తండ్రి ఎంక్వైరీ!

సాధారణంగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి ఆస్తిపాస్తులు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యం వంటివి ఆరా తీయడం చూస్తుంటాం. కానీ కాకినాడలోని రాయుడుపాలేనికి చెందిన ఓ తండ్రి మాత్రం తనకు కాబోయే అల్లుడి క్రమశిక్షణను తెలుసుకునేందుకు సరికొత్తగా ఆలోచించారు. అబ్బాయికి వాహన నిబంధనలపై గౌరవం ఉందో లేదో తెలుసుకునేందుకు కాకినాడ భానుగుడి కూడలిలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్-2 సీఐ డి.రామారావును ఆశ్రయించారు.తనకు కాబోయే అల్లుడికి చెందిన ఒక కారు, ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ నంబర్లను సీఐకి ఇచ్చిన ఆ పెద్దాయన.. ఆ వాహనాలపై ఏవైనా ట్రాఫిక్ చలానాలు ఉన్నాయేమో తనిఖీ చేయాలని కోరారు. మితిమీరిన వేగంతో వెళ్లడం, మద్యం తాగి నడపడం, నిబంధనలు ఉల్లంఘించడం లాంటివి చేస్తూ చలానాలు పడి ఉంటే.. అలాంటి వాడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయనని చెప్పడంతో సదరు పోలీస్ అధికారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భార్య చనిపోవడంతో తన ఒక్కగానొక్క కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకున్నానని, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వ్యక్తి అయితే మంచి క్రమశిక్షణ కలవాడై ఉంటాడని, తన బిడ్డను బాగా చూసుకుంటాడనే నమ్మకంతోనే ఇలా ఆరా తీస్తున్నట్లు ఆ తండ్రి వివరించారు. సీఐ వెంటనే యాప్‌లో ఆ వాహన నంబర్లను పరిశీలించి, ఎలాంటి చలానాలూ లేవని చెప్పడంతో ఆ పెద్దాయన సంతోషంగా వెనుదిరిగారు. ప్రతి తండ్రీ ఇలాగే ఆలోచిస్తే అమ్మాయిల భవిష్యత్తు బాగుంటుందని, రోడ్డు ప్రమాదాలూ తగ్గుతాయని ఈ సందర్భంగా సీఐ అభిప్రాయపడ్డారు.