2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత టీ20 జట్టు తొలి మ్యాచ్‌లోనే చిన్న జట్టు ఐర్లాండ్ చేతిలో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏ ఫార్మాట్లోనైనా టీమ్ఇండియాపై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. బెల్ఫాస్ట్లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఆరంభంలోనే పవర్ ప్లే లోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును కొత్త కెప్టెన్ లోర్కాన్ టకర్ (36 బంతుల్లో 50), గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) రాణించి ఆదుకున్నారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లతో ఆకట్టుకోగా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 49) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), శ్రేయస్ అయ్యర్ (3), తిలక్ వర్మ (19) ఘోరంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' హాలార్డ్, హంఫ్రీస్ చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బతీశారు. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకుండా టీమిండియా తప్పు చేసింది. అలానే బౌలర్లు ప్రసీద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ ఆఖర్లో ధారాళంగా పరుగులిచ్చేశారు. దాంతో టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఈ గెలుపుతో 2 మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 ఆదివారం జరగనుంది.
Share