Current Date: 21 Aug, 2026

అమిత్ షాకు సీఎం విజయ్ ఇచ్చిన బ్యాగ్‌లో ఏముంది? రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర పరిణామం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ మర్యాదపూర్వక కలయికలో భాగంగా విజయ్ మొదట అమిత్ షాకు పుష్పగుచ్ఛం అందించారు. అయితే ఆ తర్వాత ఆయన వెంట తెచ్చుకున్న ఒక బ్యాగ్‌ను అమిత్ షాకు ఇవ్వడం, దాన్ని ఆయన చిరునవ్వుతో అందుకొని టేబుల్‌పై ఉంచి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. నాయకులు సాధారణంగా శాలువాలు, పూలగుచ్ఛాలు లేదా పవిత్ర జ్ఞాపికలు బహుకరించడం చూస్తుంటాం. కానీ విజయ్ ఏకంగా ఒక బ్యాగ్‌ను అందించడంపై ప్రధానంగా రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ తన నివాసంలో ప్రత్యేకంగా తయారు చేయించిన తమిళ సంప్రదాయ భోజనాన్ని అమిత్ షా కోసం తెచ్చి ఇచ్చి ఉంటారని ఎక్కువ మంది భావిస్తున్నారు. తన వద్దకు వచ్చే అతిథులకు ఆప్యాయంగా ఆతిథ్యమిచ్చే అలవాటున్న విజయ్, తన ప్రత్యేక శైలిలోనే హోం మంత్రికి కూడా ఈ లంచ్ బ్యాగ్‌ను అందించారని చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనను రాజకీయ కోణంలోనూ కొంతమంది విశ్లేషిస్తున్నారు. గతంలో మాజీ స్పీకర్ ఎం. అప్పావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, విజయ్ పొలిటికల్ కాంట్రాక్ట్ లేదా ఏదైనా రహస్య ఒప్పంద పత్రాలను అందించారా అనే అనుమానాలను విపక్షాలు, సామాజిక మాధ్యమాలు తెరపైకి తెస్తున్నాయి. అప్పావు వ్యాఖ్యల పాత వీడియోలను ఈ ఫొటోలకు జోడిస్తూ నెటిజన్లు వైరల్ చేస్తుండటంతో, ఈ సంచి వ్యవహారం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.