హైదరాబాద్ మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ వద్ద సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న భారతి ముఖిని బలిగొన్న లగ్జరీ కారు ప్రమాదం వెనుక సంచలన నిజాలు బయటపడ్డాయి. ప్రమాదానికి కారణమైన అస్టన్ మార్టిన్ లగ్జరీ కారును నడిపింది జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ అని తేలింది. ప్రారంభంలో వీఐపీ హోదా, అధికార, ధన బలంతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా తొక్కిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల ఆందోళనలు, జాతీయ మీడియాలో వరుస కథనాలు ప్రసారం కావడంతో వ్యవహారం కాస్తా రచ్చకెక్కింది. ఈ ఉదంతం తీవ్ర దుమారం రేపడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆగస్టు 16న మధ్యాహ్నం ఇన్ఆర్బిట్ మాల్ ముందు భారతి ముఖి రోడ్డు దాటుతుండగా, 'TG-09-G-0666' రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన లగ్జరీ అస్టన్ మార్టిన్ కారుతో అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టినట్లు తేలింది. తలకు తీవ్ర గాయమై రక్తమోడుతున్న ఆమెను అదే కారులో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ క్రమంలో మాదాపూర్ పోలీసులు నిందితుడు లింగమనేని సంజూష్‌పై కేసు నమోదు చేయడంతో పాటు ప్రమాదానికి వాడిన లగ్జరీ కారును సీజ్ చేశారు. ఎంపీ లింగమేనని రమేశ్.. ఏపీ సీఎం చంద్రబాబుకి సన్నిహితుడు. ఇప్పుడు జనసేన ఎంపీగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాలుగా మారింది. జాతీయ స్థాయిలో దృష్టి పడిన ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.