Current Date: 21 Aug, 2026

ప్రభాస్ మూవీ నుంచి ఇందుకే దీపికా పదుకొణెని తప్పించారా?

రెబల్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్' సినిమా వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ నటి దీపిక పదుకోణె తప్పుకోవడానికి అసలు కారణాలను చిత్ర నిర్మాత, సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు. దీపిక భారీ రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా నికర లాభాల్లో 10 శాతం వాటా కోరడం, అలాగే పాత్ర వివరాలు ఆమె పీఆర్ టీమ్ ద్వారా లీక్ కావడం పట్ల అసంతృప్తి చెంది ఆమెను తప్పించినట్లు ప్రణయ్ వెల్లడించారు. సౌత్ కొరియా స్టార్ డాన్ లీని ఈ సినిమా కోసం తీసుకోవాలని భావించినప్పటికీ, హైదరాబాద్ నేపథ్య కథకు ఆయన పాత్ర సరిపోకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలను కేవలం పుకార్లుగానే కొట్టిపారేశారు. మరోవైపు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఆయన స్వరం వాయిస్ టీజర్‌లో వినిపించినప్పటికీ, పూర్తిస్థాయి పాత్రలో మాత్రం ఆయన కనిపించరని తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రచారాలు, మార్పు చేర్పులతో 'స్పిరిట్' చిత్రం అభిమానుల్లో, పరిశ్రమ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీపికా పదుకొణె స్థానంలో తృప్తి డిమ్రిని హీరోయిన్‌గా సందీప్ రెడ్డి తీసుకున్న విషయం తెలిసిందే.