కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక శివారు రాజానగరం (సీహెచ్ అగ్రహారం) గ్రామంలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తండ్రిపై ఉన్న ప్రేమతో ఆయన కోసం వెతుక్కుంటూ వెళ్లిన రెండేళ్ల బాలిక జాహ్నవి దారితప్పి అదృశ్యమైంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. గ్రామానికి చెందిన సుంకర గణేష్, భవానీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గణేష్ గ్రామ సమీపంలోని ఒక మామిడి తోటలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం తన పెద్ద కుమార్తె అయిన జాహ్నవిని వెంటబెట్టుకుని తోటకు వెళ్లాడు. అయితే, కొద్దిసేపటికే ట్రాన్స్‌కో సిబ్బంది అక్కడికి రావడంతో, ఆయన పాపను తిరిగి ఇంటి వద్ద దించి మళ్లీ తోటకు వెళ్లిపోయాడు. అయితే, తండ్రి వెళ్లిన కాసేపటికే బాలిక జాహ్నవి మళ్లీ తన తండ్రి కోసం ఒంటరిగా తోట వైపు బయలుదేరింది. ఈ క్రమంలో ఆమె దారితప్పి ఒక కొండ ప్రాంతం వైపు వెళ్లిపోయింది. అక్కడ ఒంటరిగా ఉన్న బాలికను, ఆమె వెంట ఉన్న పెంపుడు కుక్కను చూసి, అదే గ్రామానికి చెందిన ఒక మతిస్థిమితం లేని వ్యక్తి "ఇంటికి వెళ్దాం రా" అంటూ బాలిక వద్దకు వెళ్లాడు. అయితే ఆ పెంపుడు కుక్క అతనిపై దాడికి యత్నించడంతో, అతడు వెంటనే గ్రామానికి చేరుకుని బాలిక తల్లి భవానికి విషయం చెప్పాడు. ఆమె వెంటనే కొండ ప్రాంతానికి వెళ్లి వెతికినా పాప ఆనవాళ్లు దొరకలేదు. దీంతో భర్త గణేష్, స్థానిక గ్రామస్తుల సహాయంతో కొండ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.