Current Date: 04 Jul, 2024

ముంబయి టీమ్‌లో లుకలుకలు.. కెప్టెన్‌కి చేదు అనుభవం

ఐపీఎల్ 2024లో ముంబయి ఇండియన్స్ వరుస వివాదాల్లో కొనసాగుతోంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం.. హార్దిక్ పాండ్యాకి బాధ్యతలు అప్పగించడంతో మొదలైన గొడవ సర్దుమణగడం లేదు. దానికి తోడు వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయి టీమ్ ఓడిపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టీమ్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి రెండు మ్యాచ్‌లు ప్రత్యర్థుల సొంతగడ్డపై ఆడి ఓడిన ముంబయి టీమ్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌ని ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఆడి చిత్తుగా ఓడటం అభిమానుల్లో తీవ్ర అసహనం పెంచుతోంది.

హార్దిక్ పాండ్య టాస్‌కి వచ్చినప్పటి నుంచి మ్యాచ్ ఓటమి తర్వాత వివరణ ఇస్తున్న సమయం వరకు అతడ్ని ముంబయి అభిమానులు గేలి చేస్తూనే ఉన్నారు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకి మద్దతు పెరిగిపోతోంది. అతని చేతికి మళ్లీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక టీమ్ ముంబయి మాత్రమే. దాంతో ముంబయి టీమ్ పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.