ఐపీఎల్-2026 సీజన్ తుది సమరానికి చేరింది. శుక్రవారం ముల్లాన్‌పుర్ వేదికగా జరిగే క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. లీగ్ దశలో అద్భుతంగా ఆడి క్వాలిఫయర్-1లో ఓడిన గుజరాత్ తిరిగి పుంజుకోవాలని చూస్తుంటే, ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించి మంచి ఊపుమీదున్న రాజస్థాన్ అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో అందరి కళ్లూ రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల విధ్వంసక ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. గత మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టును గెలిపించిన వైభవ్, ఈ సీజన్లో ఇప్పటివరకు 242.85 స్ట్రైక్‌రేట్‌తో 680 పరుగులు చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. అతడితో పాటు యశస్వి జైస్వాల్, జురెల్ బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లో 24 వికెట్లతో జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్‌కు ప్రధాన బలంగా నిలిచారు. వైభవ్ విధ్వంసాన్ని అడ్డుకోవడంపైనే గుజరాత్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టు సమతూకంతో పటిష్టంగా కనిపిస్తోంది. సాయి సుదర్శన్ (652), శుభ్‌మన్ గిల్ (618), బట్లర్ (498)లతో టాప్ ఆర్డర్ భారీ స్కోర్లు సాధిస్తున్నప్పటికీ, మిడిల్ ఆర్డర్ బలహీనత ఆ జట్టును వేధిస్తోంది. అయితే 26 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న రబాడ, అతనికి తోడుగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్‌లతో కూడిన గుజరాత్ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. ముఖాముఖి పోరులో రాజస్థాన్‌పై 7-3తో గుజరాత్‌దే పైచేయి కాగా, బ్యాటింగ్‌కు అనుకూలించే ముల్లాన్‌పుర్ పిచ్‌పై ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగనుంది.