టాలీవుడ్‌లో కమెడియన్‌గా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేశ్, ఇటీవల నటుడు రాజా రవీంద్ర పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన జీవితాన్ని మలుపు తిప్పిన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి, ఇటీవలే చిరంజీవి-బాబీ చిత్రంతో రీఎంట్రీ ప్రకటించిన ఆయన, గతంలో పరిశ్రమకు చెందిన ఒక పెద్దమనిషి తనను ఎంతగా అవమానించారో గుర్తుచేసుకున్నారు. నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజున షూటింగ్ సెట్‌లో జరిగిన ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. సెట్‌లో తాను తోటి నటుడితో మాట్లాడుతుండగా, ఒక పెద్దమనిషి సడన్‌గా తనపై కోపంతో చెప్పుతో కొట్టారని బండ్ల గణేశ్ వెల్లడించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన క్షమాపణలు చెబుతూ, వేరే టెన్షన్‌లో ఉండి ఆ కోపాన్ని నీపై చూపించానని సర్దిచెప్పుకున్నప్పటికీ, తాను బలహీనుడిని కాబట్టే ఆ అవమానాన్ని భరించాల్సి వచ్చిందని గణేశ్ ఆవేదన చెందారు. నాటి ఘటనతో తీవ్రంగా గాయపడిన ఆయన, ఆ క్షణమే ఆ సెట్ నుండి బయటకు వచ్చేసినట్లు తెలిపారు. తన వద్ద డబ్బు, పరపతి లేకపోవడం వల్లే అంతటి ఘోర అవమానం జరిగిందని గ్రహించిన బండ్ల గణేశ్, ఆ రోజే ఒక బలమైన సవాల్ విసురుకున్నారు. తనను అవమానించిన వ్యక్తి కంటే ఎక్కువ డబ్బు సంపాదించి, లైఫ్‌లో సక్సెస్ సాధించి చూపిస్తానని తనకు తానే ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఆ కసి, పట్టుదలే తనను తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో కోట్లు కూడబెట్టిన సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టాయని, ఆ అవమానమే తన జీవితానికి వరంగా మారిందని ఆయన స్పష్టం చేశారు.