Current Date: 18 Feb, 2026

హీరోయిన్ అమీషా పటేల్‌కు నాన్-బైలబుల్ వారెంట్.. కేసు ఏంటంటే?

బాలీవుడ్ నటి అమీషా పటేల్ ఒక ఆర్థిక లావాదేవీల కేసులో చిక్కుల్లో పడ్డారు. 2017లో మురాదాబాద్‌లో జరిగిన ఒక పెళ్లిలో ప్రదర్శన ఇచ్చేందుకు ఆమె ఒప్పందం చేసుకుని, అడ్వాన్స్‌గా 14.50 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే, డబ్బులు తీసుకున్నప్పటికీ ఆమె ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. నిర్వాహకులు ప్రశ్నించగా, తాను రాలేకపోయానని, ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని ఆమె మాట ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం ఆమె 10 లక్షల రూపాయలను నగదు రూపంలో చెల్లించారు. మిగిలిన 4.50 లక్షల రూపాయలకు చెక్ ఇచ్చారు. కానీ, ఆమె ఇచ్చిన చెక్ బ్యాంకులో బౌన్స్ అయ్యింది. ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇవ్వకుండా ఆమె తప్పించుకుని తిరుగుతుండటంతో, కార్యక్రమ నిర్వాహకులు మురాదాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి కోర్టు పలుమార్లు సమ్మన్లు జారీ చేసినప్పటికీ అమీషా పటేల్ హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈసారి కూడా ఆమె కోర్టుకు హాజరు కాకపోతే అరెస్ట్ తప్పదని న్యాయస్థానం హెచ్చరించింది