Current Date: 27 Nov, 2024

తనను వేధించిన కృష్ణా జిల్లా ఎస్పీ జాషువాపై పట్టాభి వెటకారపు అభినందన

ఏపీలో కూటమి విజయం సాధించిన నేపథ్యంలో.. గతంలో తనను అక్రమంగా నిర్బంధించి ‘రాచ మర్యాదలు’ చేసిన అప్పటి కృష్ణ జిల్లా ఎస్పీ జాషువాను అభినందించేందుకు  తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ వెళ్లారు. 2023, ఫిబ్రవరి 20న ఒక అక్రమ కేసులో కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో పట్టాభిని నిర్బంధించి, అర్థరాత్రి కరెంట్‌ నిలిపి వేసి పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ఆ తర్వాత ఎస్పీ జాషువాను రాష్ట్ర మంత్రి ఒకరు చిత్తూరు జిల్లా పుంగనూర్‌లో పోస్టింగ్‌ వేయించారు. అయితే ఆయనను ఎన్నికల కమిషన్‌ విధుల నుంచి తప్పించింది. రాష్ట్రంలో కూటమి గెలిచిన నేపథ్యంలో... గతంలో తనపై వేధింపులకు కారణమైన ఎస్పీ జాషువాను కలిసేందుకు పట్టాభితో పాటు  టీడీపీ  అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ, తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, సీనియర్‌ బీసీ నాయకులు కాపు మల్లిఖార్జున యాదవ్‌, తెలుగుయువత నాయకుడు బుడిపిటి సురేశ్‌ తదితరులు బయలుదేరారు. ప్రస్తుతం జాషువా విజయవాడ సమీపంలోని తన ఏడున్నర ఎకరాల్లో ఉన్న విలాసవంతమైన అతిథిగృహంలో ఉన్నారని తెలుసుకుని వారికి పుష్పగుచ్ఛాలు అందించేందుకు వీరంతా వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన టీడీపీ నేతలకు.. సదరు పోలీసు అధికారి మంగళవారం నాడు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసి, ఆచూకీ లేకుండా పోయినట్టు తెలిసింది. దీంతో టీడీపీ నేతలు.. ఆ పోలీసు అధికారికి సత్కరించేందుకు తీసుకెళ్లిన పుష్పగుచ్ఛం, శాలువాను వారి అతిథి గృహంలోనే ఒక కుర్చీలో ఉంచి వీడియో ద్వారా తమ సందేశాన్ని ఎస్పీ గారి  సెల్‌ ఫోన్‌కు పంపించారు.