బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా చేరో టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా పింక్ బాల్ టెస్టులో మాత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో తర్వాత జరగబోయే మ్యాచ్‌లపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.టీమిండియా బౌలింగ్ బలోపేతం కావాల్సిన తరుణంలో స్టార్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులోకి రీఎంట్రీపై నిరీక్షణ కొనసాగుతోంది. చివరి రెండు టెస్ట్ మ్యాచుల్లో షమీ జట్టులోకి వస్తాడని వార్తలు వచ్చాయి. అయితే అతడు ఇంకా టెస్ట్ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది. దీంతో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకపోవచ్చని సమాచారం.షమీ గత ఏడాదికాలంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. అతడి పరిస్థితిని నిపుణులు పర్యవేక్షిస్తున్నారన్న కెప్టెన్ రోహిత్.. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భారత్ జట్టులో జస్‌ప్రీత్ బుమ్రాపై ఎక్కువగా భారం పడుతోంది. అతనికి సహాయం చేయాల్సిన సిరాజ్, హర్షిత్ రాణా చేతులెత్తేస్తున్న దాంతో.. షమీ రీఎంట్రీ ఇస్తే బౌలింగ్ విభాగం బలోపేతం అవుతుందని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.