ఆగిపోయిన రాజధాని అమరావతి పనులకు ఏపీ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టబోతోంది. అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పునఃప్రారంభించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 160 కోట్లతో ఏడు అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది. ఆ పనులను గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ నెల 16న జరిగిన సీఆర్డీఏ సమావేశంలో అమరావతి పనుల పునఃప్రారంభంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మళ్లీ వెనక్కి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, 4 లైన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని ఆదేశించారు. రూ. 160 కోట్లతో 2,42,481 చదరపు అడుగుల్లో సీఆర్డీఏ కార్యాలయం నిర్మాణానికి ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ఎలాంటి విద్యా సంస్థలను ఆహ్వానించాలనే అంశంపై చర్చించారు. ఈ మేరకు ఈరోజు అమరావతి పనులు ప్రారంభం కానున్నాయి.
Share