Current Date: 02 Jul, 2024

యాక్సిడెంట్ కేసులో రఘుబాబు అరెస్ట్.. కానీ గంటల్లోనే?

టాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ కమెడియన్ రఘుబాబు అరెస్ట్ అయ్యారు. బీఆర్‌ఎస్ నేత సందినేని జనార్దన్‌రావు యాక్సిడెంట్ కేసులో రఘుబాబుని నల్గొండ రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గంటల వ్యవధిలోనే బెయిల్‌పై అతను విడుదల అయినట్లు తెలుస్తోంది.

నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 51 ఏళ్ల సందినేని జనార్దన్ రావు.. బీఆర్ఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్తుండేవారు. అలా వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న BMW కారు జనార్దన్ రావు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు.
 
ప్రమాదానికి కారణమైన కారులో నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన మరో కారులోకి మారారు. ఆ సమయంలో రఘుబాబుతో కొంత మంది స్థానికులు మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును వారు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, మృతుని భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.