Current Date: 27 Nov, 2024

విశాఖ కేంద్రంగా ‘బెట్టింగ్‌ యాప్‌’ దందా

 విశాఖలో మరో కొత్త దందా బయటపడగా, సైబర్‌ క్రైం పోలీసులు ఓ ముఠా గుట్టును రట్టు చేశారు. బెట్టింగ్‌ యాప్‌ పేరిట దందా నడుపుతున్న ఏడుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, చెక్కుబుక్కులు, సిమ్‌కార్డుల్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంకభ్రత బగ్చీ ఇక్కడి కాన్ఫరెన్స్‌ హోల్‌లో గురువారం మీడియాకు వెల్లడిరచారు. విశాఖ కేంద్రంగా ఈ ముఠా సభ్యులు బెట్టింగ్‌ యాప్‌ సాయంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏడుగురు నిందితుల నుంచి వందల సంఖ్యలో డెబిట్‌ కార్డులు, బ్యాంకు చెక్‌ బుక్‌లు, 10ల్యాప్‌ టాప్‌లు, 8డెస్క్‌ టాప్‌లు, ఓ కారుతో పాటు మరో ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేశారు. అహ్మదాబాద్‌ నుంచి వచ్చిన సమాచారంతో విచారణ మొదలెట్టామని, ఈ కేసులో సైబర్‌ నేరస్తులకు చైనా దేశంతో సంబంధాలున్నాయని, రకరకాల పేర్లతో బెట్టింగ్‌ యాప్‌లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆర్బీఐ అనుమతి లేకుండానే బెట్టింగ్‌ యాప్‌ నిర్వహిస్తున్నారని, తాము సంపాదించిన సొమ్మును చైనా, తైవాన్‌ దేశాలకు పంపిస్తున్నారని సీపీ ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. 

Share