Current Date: 02 Aug, 2026

కామన్వెల్త్ గేమ్స్.. జావలిన్ త్రోలో భారత్‌కు పతకాల పంట!

కామన్వెల్త్ గేమ్స్ జావలిన్ త్రో విభాగంలో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో భారత్ ఏకంగా రెండు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా వెండి పతకం సాధించగా, యష్‌వీర్ సింగ్ సంచలన ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో భారత స్టార్ జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈటెను 85.83 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. గతంలో 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన నీరజ్, ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ గేమ్స్‌లో రీ-ఎంట్రీ ఇచ్చి వెండి పతకాన్ని ముద్దాడారు. మరోవైపు భారత్‌కే చెందిన యష్‌వీర్ సింగ్ 85.41 మీటర్ల దూరం విసిరి అనూహ్య రీతిలో బ్రాంజ్ మెడల్ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇక ఈ పోరులో శ్రీలంక అథ్లెట్ రుమేష్ పతిరగే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఆయన ఏకంగా 89.75 మీటర్ల దూరం త్రో చేసి అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని  కైవసం చేసుకున్నారు. ఒకే పోటీలో భారత్‌కు రెండు పతకాలు రావడంతో క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.