ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఎట్టకేలకు యూటర్న్ తీసుకున్నారు. బన్నీని కలవాలంటే 'కళ్లలోకి చూడకూడదు', 'కరచాలనం చేయకూడదు' వంటి 42 కఠిన నిబంధనలు ఉంటాయంటూ ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఈ ఆరోపణలను అల్లు అర్జున్ టీమ్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించడంతో ఆమె దిగివచ్చారు. తాజాగా విడుదల చేసిన బహిరంగ క్షమాపణ పత్రంలో కావేరి తన తప్పును ఒప్పుకున్నారు. ఆ 42 నిబంధనల జాబితా అనేది కేవలం తన సొంత కల్పితమేనని, అల్లు అర్జున్ తరపున అలాంటి పత్రం ఏదీ తనకు అందలేదని స్పష్టం చేశారు. సంభాషణలో భాగంగా సరదాగా అన్న మాటలను వాస్తవాలుగా పరిగణించవద్దని కోరారు. తన అసత్య ప్రచారం వల్ల అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని, ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ఈ వివాదానికి వేదికైన పాడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి కూడా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. వివాదాస్పదమైన ఆ ఎపిసోడ్‌తో పాటు దానికి సంబంధించిన అన్ని వీడియో క్లిప్‌లను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించినట్లు వెల్లడించారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, జరిగిన పొరపాటుకు బాధ్యత వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దీంతో గత కొద్దిరోజులుగా నెట్టింట సాగుతున్న ఈ వివాదానికి తెరపడినట్లయింది.
Share