Current Date: 02 Jul, 2024

ఇరాన్‌లో హెలీకాప్టర్ ప్రమాదం, దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి

ఇరాన్ దేశంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చాపర్ క్రాష్ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని ఇరాన్ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అసలేం జరిగిందంటే

అజర్ బైజాన్-ఇరాన్ ఉమ్మడి ప్రాజెక్టు క్విజ్ ఖలైసీ డ్యామ్ ప్రారంభించేందుకు నిన్న ఆదివారం అజర్ బైజాన్ వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో హెలీకాప్టర్ కుప్పకూలింది. దట్టమైన పొగమంచు కారణంగా హెలీకాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. రెస్క్యూ ఆపరేషన్ కూడా 18 గంటలకు పైగా కొనసాగింది. ఇరాన్ సెర్చ్ ఆపరేషన్‌లో సహాయపడుతున్న టర్కిష్ ద్రోన్ ఒకటి హెలీకాప్టర్ ప్రమాద ప్రదేశాన్ని గుర్తించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాంతానికి రెస్క్యూ బృందాల్ని పంపించారు. హెలీకాప్టర్ క్రాష్ వార్త వచ్చినప్పట్నించి దాదాపు 18 గంటల్నించి రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రమాద సమయంలో హెలీకాప్టర్‌లో ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి అమీరబ్దుల్లాహియాన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరున్నారు.

ప్రమాదానికి గురైన హెలీకాప్టర్ శకలాల్ని ఇవాళ గుర్తించిన రెస్క్యూ బృందాలు ఛాపర్ పూర్తిగా కాలిపోయి ఉండటాన్ని గమనించారు. హెలీకాప్టర్ శకలాల్ని 2 కిలోమీటర్ల దూరం నుంచి చూసినట్టుగా ఇరానియన్ హెడ్ క్రిసెంట్ సొసైటీ ఛీఫ్ పీర్ హొస్సేన్ తెలిపారు. అతి క్లిష్టమైన పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవి కారణంగా ఘటనా ప్రాంతానికి చేరుకోవడం కష్టమౌతోందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో లేరనే తెలుస్తోందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీలు ధృవీకరించాయి.

ఇబ్రహీం రైసీ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ తరువాత అత్యంత శక్తివంతమైన నేతగా ఉండి రెండోసారి దేశాధ్యక్షుడయ్యారు. ఈస్ట్ అజర్ బైజాన్ ప్రావిన్స్‌లో ఇరాన్-అజర్ బైజాన్ సంయుక్తంగా అరాస్ నదిపై నిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.