మన తెలుగు రాష్ట్రాల్లో కావ్య పాప గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఐపీఎల్ సమయంలో తెగ సందడి చేసే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్య మారన్.. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రతో ఒక్కటి కాబోతున్నారనే ప్రచారం సినీ, క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని వార్తలు వస్తుండగా, తాజాగా వీరి వివాహానికి సంబంధించిన తేదీ, వేదిక వివరాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నవంబర్ 10న గ్రీస్‌లో అత్యంత ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అత్యంత సన్నిహితుల మధ్యనే ఈ వివాహ వేడుక ప్రైవేట్‌గా జరగనుందని తమిళ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఈ జంట విదేశీ పర్యటనలకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం, దానికితోడు ఇటీవల అనిరుధ్ మేనమామ, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఈ పెళ్లి వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తెగా కావ్య మారన్, వరుస చార్ట్‌బస్టర్ హిట్స్‌తో దక్షిణాదిన సంచలనం సృష్టిస్తున్న సంగీత దర్శకుడిగా అనిరుధ్ తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ పెళ్లి వార్తలపై అనిరుధ్ గానీ, కావ్య మారన్ కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.