బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ఆయన చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. విదేశాల్లో విమానాలు లేక, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందిపడుతున్న వారికి ఉచితంగా వసతి కల్పించనున్నట్లు సోనూసూద్ ప్రకటించారు. ఈ సహాయం అందించడానికి ఆయన ఎలాంటి షరతులు విధించకపోవడం విశేషం. ఏ దేశానికి చెందిన ప్రయాణికులైనా, ఏ భాష మాట్లాడే వారైనా దుబాయ్‌లో ఇబ్బందుల్లో ఉంటే తన బృందాన్ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాలు, మతాల కంటే మానవత్వం మాత్రమే ముఖ్యమని, ఒకరికొకరు తోడుగా ఉండాలని సోనూసూద్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సహాయం అవసరమైన వారు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వ్యక్తిగత సందేశం పంపాలని, తన బృందం వెంటనే వారిని సంప్రదించి అవసరమైన వసతి ఏర్పాట్లు చేస్తుందని ఆయన వివరించారు. కరోనా కష్టకాలం నుండి నేటి వరకు నిరంతరం సామాన్యులకు అండగా నిలుస్తున్న సోనూసూద్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.