Current Date: 08 Feb, 2026

భారత యంగ్ క్రికెటర్ సిక్సర్లతో ఊచకోత.. అరెస్ట్‌కు ప్రత్యర్థి డిమాండ్!

హరారే వేదికగా జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో గెలుపొంది, ఆరోసారి ప్రపంచ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. ఈ విజయంలో 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. కేవలం 80 బంతుల్లోనే 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేసిన వైభవ్, అండర్-19 చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయే విధ్వంసాన్ని సృష్టించాడు. వైభవ్ ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు నిశ్చేష్టులయ్యారు. ఆయన బ్యాటింగ్ చూసి ఐస్‌లాండ్‌ క్రికెట్‌ బోర్డు సరదాగా స్పందిస్తూ.. ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ చూపినది 'ఎక్స్‌ రేటెడ్ హింస' అని, వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ రికార్డు ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు అద్భుతంగానే పోరాడింది. ఆ జట్టు ఆటగాడు కాలెబ్ 115 పరుగులతో వీరోచిత శతకం బాదినప్పటికీ, లక్ష్యం చాలా పెద్దది కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఆ జట్టు 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ కావడంతో, టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో భారత యువ జట్టు మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.