ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా గడుస్తోంది. వరుసగా పలువురు కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించనున్నారు. జల్ జీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ ద్వారా కళాయిలను ఏర్పాటు చేయనున్నారు. కావున ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రధాని మోదీని పవన్ కోరనున్నారు. నేడు ఢిల్లీలో పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఉప రాష్ట్రపతిని పవన్ కల్యాణ్ ఆహ్వానించారు.
Share