Current Date: 18 Jun, 2026

ఉష్!...ఊరందరికీ తెలుసు. చిన్నారి జాహ్నవి మృత దేహాన్ని కప్పెట్టేశారట

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి అడవి పందుల కోసం పెట్టిన  విద్యుత్ తీగల  షాక్ వల్ల దుర్మరణం చెందడం తో   బాలిక మృత దేహాన్ని చడీ  చప్పుడూ లేకుండా కొండ మీదకు తీసుకు వెళ్లి కప్పెట్టేసినట్టు  తెలుస్తోంది.ఈ విషయం ఊరంతా తెలిసినప్పటికీ పోలీసులు మాత్రం  పన్నెండు రోజుల నుంచీ బాలికను వెదుకుతూనే వున్నారు.  అసలు విషయాన్ని మభ్య పెట్టి గాలింపు పేరుతో పోలీసులు  కేసును పక్క దోవ పట్టిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  అడవి పందుల వ్యాపారం చేసే వాళ్లంతా ఏకమై విద్యుత్ తీగల వల్ల మరణించిన రెండేళ్ల జాహ్నవి మృత దేహాన్ని గొయ్యి తీసి కాప్పెట్టిన విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. చివరకు     తమ కుమార్తె  మృత దేహాన్ని  గొయ్యి తీసి కప్పెట్టిన విషయం తల్లి, దండ్రులకు తెలిసినా వీళ్ళ నోళ్లు కూడా నొక్కేశారంటే  ఇక్కడ అడవి పందుల మాఫీయా ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఈ ప్రాంతంలో అడవి పందులను ఎర వేయడానికి  పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చడం సాధారణం. చుట్టు పక్కల కొండల నుంచి వచ్చే అడవి పందులు విద్యుత్ వైర్లకు చిక్కుతుంటాయి. ఈ ప్రాంతంలో ఇదే పెద్ద వ్యాపారం.అందువల్లనే అడవి పందుల మాంసం   ఈ ప్రాంతంలో అధికంగా దొరుకుతుంది. అడవి పందుల కోసం పెట్టిన విద్యుత్ వైర్ల బారిన పడి జాహ్నవి చనిపోయింది. ఈ విషయం బయట పడితే  పోలీస్ కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుందనే భయం తో  బాలిక మృత దేహాన్ని  కాప్పెట్టేసినట్టు స్థానికుల ద్వారా తెలుస్తోంది.ఈ విషయాన్ని దాచి పెట్టి 
బాలిక అడవి జంతువులు లేదా కొండచిలువల బారిన పడిందా అనే కోణంలో  ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్టు ఇప్పటికీ పోలీసులు నమ్మ బలుకుతున్నారు. రెండేళ్ల క్రితం కోటవురట్ల ప్రాంతంలో ఒక వ్యక్తి ఇలాగే విద్యుత్ తీగలు తగిలి చనిపోతే అతడి మృత దేహాన్ని నూతిలో  పడేసి కేసును మాఫీ చేయాలని ప్రయత్నించారు.  చివరకు విషయం బయట పడి నిందితులు దొరికి పోయారు. ఇప్పుడు ఈ బాలిక కేసును కూడా అదే విధంగా దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయట పడే అవకాశం వుంది.. కానీ కేసును దారి మళ్ళించి చివరకు అడవి జంతువులు బాలికను ఎత్తుకు పోయాయని పోలీసులు కేసును ముగించినా ఆశ్చర్యపోనవసరం  లేదన్న అభిప్రాయం ప్రజల్లో వుంది.