Current Date: 18 Jun, 2026

ముంబయి వెర్సోవా బీచ్‌లో అర్ధరాత్రి వింత దృశ్యం.. నెటిజన్లు ఫైర్

ముంబైలోని వెర్సోవా బీచ్‌లో రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో ప్రజలు ఇసుకపై పడుకుని నిద్రపోతున్న ఒక వీడియో ప్రస్తుతం X (ట్విట్టర్) వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ముంబై నగరంలో గృహ వసతి కొరత, వలసలు, పేదరికం, బహిరంగ ప్రదేశాల వినియోగంపై నెటిజన్ల మధ్య ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఒక నెటిజన్ ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ, తనకు ముంబైలో ఇలాంటి దృశ్యం ముందెన్నడూ కనిపించలేదని పేర్కొన్నారు. ఇటీవల భయందర్ ఖాడీ ప్రాంతంలో కూడా ఇలాంటిదే చూశానని చెబుతూ, నగరంలో ఉండటానికి స్థలం లేకపోతే ముంబై వదిలి వెళ్ళిపోవాలని, అంతే కానీ ఇలా ప్రజా ప్రదేశాలను పాడు చేయవద్దని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి మద్దతుగా మరో నెటిజన్ స్పందిస్తూ, క్రితం రాత్రి బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో కూడా తాను ఇలాంటి దృశ్యాన్నే చూశానని చెప్పుకొచ్చారు. నగరంలో పెరుగుతున్న ఎండల తీవ్రత వల్లే ప్రజలు ఇలా బీచ్‌లకు వస్తున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతల కారణంగా రేకుల కప్పులు ఉండే మురికివాడల ఇళ్లలో రాత్రి వేళల్లో నిద్రపోవడం దాదాపు అసాధ్యమని, అందుకే సమీపంలోని మురికివాడల ప్రజలు చల్లటి గాలి కోసం బీచ్‌కు వచ్చి ఉంటారని వారు పేర్కొంటున్నారు. ముంబై లాంటి మహానగరంలో సామాన్యులు ఎదుర్కొంటున్న నివాస సమస్యలకు, మౌలిక వసతుల కొరతకు ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.