యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో కన్నతండ్రే కాలయముడైన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల రవి, తన భార్య స్వాతితో ఉన్న కుటుంబ కలహాల నేపథ్యంలో, రెండు ఏళ్ల కుమార్తె మేఘనను అత్యంత క్రూరంగా హతమార్చాడు. భార్యతో గొడవల కారణంగా పెద్ద కుమార్తె తన నుండి దూరమవుతుందనే కోపంతో, ఆ చిన్నారి ప్రాణాలు తీయాలని రవి నిర్ణయించుకున్నాడు. రవి తన కుమార్తెకు సపోటా పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. తండ్రి ప్రేమతో ఇచ్చాడనుకున్న ఆ చిన్నారి సంతోషంగా పండు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రవి కూడా నిద్రమాత్రలు, ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. తన బిడ్డను పొట్టనబెట్టుకున్న భర్తపై స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంస్థాన్ నారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పసిపాప ప్రాణాలు తీసిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Share