Current Date: 26 Mar, 2026

ఐపీఎల్‌లో మరో సంచలనం.. 15 వేల కోట్లకు రాజస్థాన్ జట్టు అమ్మకం

ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం మార్పు ఒక సంచలనంగా మారింది. 2008లో లీగ్ ఆరంభం నుండి ఉన్న ఈ జట్టును అమెరికాకు చెందిన కాల్ సోమాని కన్సార్టియమ్ ఏకంగా 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,341 కోట్లు) దక్కించుకుంది. ఈ కన్సార్టియంలో అరిజోనాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కాల్ సోమానితో పాటు, ప్రపంచ ప్రఖ్యాత వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన రాబ్ వాల్టన్, ఫోర్డ్ మోటార్స్ యజమానులైన హ్యాంప్ ఫ్యామిలీ ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు. ఈ ఒప్పందం ఐపీఎల్ బ్రాండ్ విలువ ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టం చేస్తోంది. 2008లో కేవలం 67 మిలియన్ డాలర్లకు (అప్పట్లో సుమారు రూ. 320 కోట్లు) అమ్ముడుపోయిన ఈ జట్టు, ఇతర ఏడు జట్ల కంటే తక్కువ ధర పలికింది. కానీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత దాని విలువ సుమారు 48 రెట్లు పెరగడం గమనార్హం. 2021 నుండి ఈ జట్టులో చిన్న వాటాదారుడిగా ఉన్న కాల్ సోమాని, ఇప్పుడు 100 శాతం వాటాను సొంతం చేసుకోవడం విశేషం. అయితే, ఈ భారీ ఒప్పందానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం, ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాతే కొత్త యాజమాన్యానికి జట్టుపై పూర్తి హక్కులు లభిస్తాయి. స్టార్ ఆటగాళ్లు పెద్దగా లేకపోయినా, గతంలో నిషేధాన్ని ఎదుర్కొన్నా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ స్థాయిలో మార్కెట్ విలువను సంపాదించుకోవడం క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.