కర్ణాటకలోని ప్రసిద్ధ మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనే పెంపుడు ఏనుగుల కోసం అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవాల్లో భాగమయ్యే అన్ని ఏనుగులకూ చరిత్రలోనే మొదటిసారిగా ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) పరీక్షలను నిర్వహిస్తోంది. సాధారణంగా ఉత్సవాల శిక్షణ పూర్తయిన అనంతరం కొన్ని ఏనుగులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతుండటంతో, వాటి గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఈ పరీక్షలను అధికారులు తప్పనిసరి చేశారు. ఈ ప్రత్యేక వైద్య పరీక్షల ప్రక్రియలో భాగంగా మొదటి దశలో కొడగు జిల్లాలోని మత్తిగోడు, దుబారేతో పాటు బండీపురలోని రాంపుర ఏనుగుల శిబిరాల్లో ఉన్న 20కుపైగా పెంపుడు ఏనుగులకు ఈసీజీ నిర్వహించారు. వీటితో పాటే అన్ని ఏనుగులకు రొటీన్ మూత్ర, రక్త పరీక్షలను కూడా చేస్తున్నట్లు పశు వైద్యుడు డాక్టర్ ముజీద్ వెల్లడించారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఏనుగుల జాబితాను త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపిస్తామని డీసీఎఫ్ డాక్టర్ ప్రభుగౌడ వివరించారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా, వైద్యుల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఈ ఏడాది దసరా వేడుకల కోసం ఏనుగుల తుది ఎంపిక ప్రక్రియ ఉంటుందని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.