Current Date: 26 Nov, 2024

ఆసుపత్రి బిల్ చూపించాల్సిందే.. కర్ణాటక ప్రభుత్వం ఆదేశం

కర్ణాటకలోని ప్రైవేట్ ఆసుపత్రుల దందాలకి చెక్ పెట్టే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పేషెంట్ బిల్, వసూలు చేసిన ఛార్జీల వివరాలను అధికారికంగా వెబ్‌సైట్, నోటీస్ బోర్డుల్లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.  ఈ మేరకు కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ సవరణ చట్టం, 2017లోని సెక్షన్ 10(1)ను గుర్తు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.వైద్య చికిత్సల, ఆసుపత్రి ఛార్జీలు, ఇతర సేవలకి వసూలు చేసిన మొత్తం డబ్బు వివరాల్ని పబ్లిక్ వెబ్‌సైట్ లేదా ఆసుపత్రి సొంత వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అలానే రోగులకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా బుక్‌లెట్‌లు లేదా బ్రోచర్‌లలోనూ పొందుపరచాలని తెలిపింది. ప్రైవేట్ వైద్య సంస్థలు అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు వరుసగా ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స లేదా సేవలకు కన్సాలిడేటెడ్‌ ధరలు వసూలు చేస్తున్నాయని, వాటికి సంబంధించిన బిల్లులు ఇవ్వడం లేదని ఆరోగ్యశాఖ కమిషనరేట్‌ దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. దాంతో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ప్రతి సేవకు ఒక ఐటమైజ్డ్ బిల్లును అందించేలా చూసుకోవాలని జిల్లా హెచ్‌ఎఫ్‌డబ్ల్యూ అధికారులకి ఆదేశాలు వెళ్లాయి.