ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భుజాలకు తక్షణమే సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. గత కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజాల కండరాల సమస్యతో ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబయి వెళ్లిన పవన్ కల్యాణ్‌కు అక్కడి నిపుణులు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.పవన్ కల్యాణ్ రెండు భుజాలను నిశితంగా పరిశీలించిన వైద్య బృందం.. రొటేటర్ కఫ్‌తో పాటు భుజానికి సంబంధించిన రెండు ప్రధాన కండరాలు పూర్తిగా చిట్లిపోయినట్లు గుర్తించారు. గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ఆలస్యం చేయకుండా వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభల్లో ఒత్తిడి కారణంగా ఈ పాత గాయాల తీవ్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. వైద్యులు తక్షణం సర్జరీ అవసరమని సూచించినప్పటికీ, పవన్ కల్యాణ్ తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించి ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ బాధ్యతలు చాలా ఉన్నాయని.. వాటిని పూర్తి చేసిన తర్వాతే తాను శస్త్రచికిత్స చేయించుకుంటానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.