Current Date: 04 Jul, 2024

ఏపీలో పెన్షన్ టెన్షన్.. టీడీపీకి ఇప్పుడు మరో తలనొప్పి!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ వ్యవహారం రోజురోజుకీ హాట్ టాపిక్ గా మారుతోంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించొద్దని ఈసీ ఆదేశించడంతో, సచివాలయాల్లోనే ఏప్రిల్‌లో పంపిణీ పూర్తి చేశారు.

ఈనెల మాత్రం పరిస్థితి మారింది. డీబీటీ ద్వారా పెన్షన్ల పంపిణీ చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల్లో ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన వారికి మాత్రమే డీబీటీ ద్వారా వారి వారి బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్ సొమ్ము జమ అవుతుంది. మిగతావారికి మాత్రం సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారు. దాంతో బ్యాంక్‌ నుంచి ఆ పెన్షన్ డబ్బు తెచ్చుకోవడానికి మే నెలలో క్యూ కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కూడా టీడీపీకి తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.

గత నెల వృద్ధులు, వికలాంగులు ఎండలో పెన్షన్ల కోసం సచివాలయాలకు వచ్చారు. పడిగాపుల పడుతూ చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఆ పాపం వాలంటీర్లపై ఫిర్యాదు చేయించిన టీడీపీదే. అయితే ప్రభుత్వం ఈసారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం డీబీటీవైపు మొగ్గు చూపారు ఉన్నతాధికారులు. డీబీటీ ద్వారా లబ్ధిదారుల్లో 74.70 శాతం మందికి బ్యాంక్ అకౌంట్లలో ఆ సొమ్ము జమ అవుతుంది. మిగతా వారికి మాత్రం సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తారు. 1నుంచి 5 వరకు.. ఈనెల 1 నుంచి పెన్షన్ల పంపిణీ మొదలవుతుంది, 5వతేదీలోగా పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నారు