Current Date: 17 Aug, 2026

బాలీవుడ్ స్టార్ హీరోలకు షోకాజ్ నోటీసులు.. యాడ్ తెచ్చిన తంట

మహారాష్ట్రలో నిషేధించిన పాన్ మసాలా బ్రాండ్లకు పరోక్షంగా (సర్రోగేట్ అడ్వర్టైజింగ్) ప్రచారం చేస్తున్న బాలీవుడ్ ప్రముఖ నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం (ఎఫ్‌డీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  విమల్ ఇలాచీ' పేరుతో చేస్తున్న ఈ ప్రచారాలు, వాస్తవానికి నిషేధిత ఉత్పత్తయిన 'విమల్ పాన్ మసాలా'ను పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నట్లుగానే ఉన్నాయని ఎఫ్‌డీఏ ప్రాథమికంగా నిర్ధారించింది.  ఈ నోటీసుల ప్రకారం, సదరు ప్రకటనల నుంచి నటులు తక్షణమే వైదొలగాలని, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి దీనికి సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించారు. ఆహార భద్రత నిబంధనల చట్టం 2006, అలాగే వినియోగదారుల పరిరక్షణ చట్టాల కింద ఇటువంటి దారిమళ్లించే ప్రకటనల ప్రచారం నేరమని ఎఫ్‌డీఏ పేర్కొంది.  ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చి, తగిన ఆధారాలు సమర్పించాలని నటులకు ఆదేశాలు వెళ్లాయి. సరైన సమాధానం రాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని ఎఫ్‌డీఏ స్పష్టం చేయడంతో, ఇప్పుడు ఈ బాలీవుడ్ స్టార్స్ స్పందనపై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.