Current Date: 19 Jun, 2026

మహేష్ బాబు చుట్టూ ముగ్గురు చక్కర్లు.. కానీ పట్టించుకోని సూపర్ స్టార్

సూపర్‌స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రాలపై టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆయన దర్శకుడు రాజమౌళితో కలిసి 'వారణాసి' సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ ఫ్రీ అవ్వడానికి చాలా సమయం పడుతుందని తెలిసినప్పటికీ, ఆయన చుట్టూ ముగ్గురు క్రేజీ దర్శకుల పేర్లు బలంగా వినిపిస్తుండటం విశేషం. ఈ రేసులో మొదటిగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగ పేరు వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌పై చాన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. తాజా ప్రచారం ప్రకారం.. సందీప్ తన 'స్పిరిట్' సినిమా పూర్తి చేసిన తర్వాత, 'యానిమల్ పార్క్' కంటే ముందే మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. మహేష్‌తో చర్చలు జరిగిన మాట వాస్తవమే అని ఒప్పుకున్న బుచ్చిబాబు, ప్రస్తుతానికి ఏదీ ఫైనల్ కాలేదని, కాలమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. వీరిద్దరితో పాటు మహేష్‌కు ఇదివరకే 'సరిలేరు నీకెవ్వరు' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి పేరు కూడా ఈ జాబితాలో చేరింది. అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో ఒక స్పోర్ట్స్ జానర్ కథతో ప్లాన్ చేస్తున్నట్లు, ఇందులో మహేష్ కోచ్‌గా కనిపిస్తారని సరికొత్త ప్రచారం మొదలైంది. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఎవరికి ముందుగా అవకాశం ఇస్తారో చూడాలి.