Current Date: 21 Sep, 2024

సింహాచలంలో వాడేది కూడా కల్తీ నెయ్యేనా !

ప్రపంచ వ్యాప్తంగా సంచలనానికి దారితీసిన తిరుమల వెంకన్న లడ్డూ, నెయ్యి వ్యవహారంతో రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ప్రసాదాలు, సరుకుల కొనుగోళ్ల అంశంపై కూడా పలు అనుమానాలు, అపోహలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భీమునిపట్నం శాసన సభ్యుడు గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గం పరిధిలోని సింహాచలం దేవాలయాన్ని శనివారం సందర్శించారు. సెంట్రల్‌ స్టోర్‌, ప్రసాదాలను తనిఖీ చేశారు. గడిచిన ఐదేళ్లల్లో దేవస్థానానికి కొనుగోలు చేసిన సరుకుల వివరాలను అడిగితెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. టెండర్ల ప్రక్రియతో పాటు సరుకులు తీసుకునే విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా నెయ్యి కొనుగోలు పై రికార్డులను లోతుగా అధ్యయనం చేసారు. ఏ ఈఓ లు ఆనందకుమార్‌, పిల్లా శ్రీనివాసరావుతో పాటు గుమాస్తాలు ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కిలో నెయ్యి 385 రూపాయలుకి (జీఎస్‌టీతో కలుపుకొని) కొనుగోలు చేయడం పై ఎమ్మెల్యే విస్మయ వ్యక్తం చేశారు. ఇంత తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేశారంటూ ప్రశ్నించారు. గతంలో పంపిణీ చేసిన విశాఖ డైరీ నెయ్యిని ఎందుకు నిలిపివేశారంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన సంస్థ నుండి ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. మార్కెట్‌లో కిలో నెయ్యి ధర కనీసం ఆరు వందలుంటే ఇంత తక్కువ ధరకు ఎలా కొన్నారని ప్రశ్నించారు. 

Share