ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు పూర్తయిన తరుణంలో రాజకీయ వాతావరణం నెమ్మదిగా మారుతోంది. జగన్ పర్యటనలకు వస్తున్న స్పందన చూస్తుంటే, రాష్ట్రంలో సంప్రదాయబద్ధంగా జరిగే 'అధికార మార్పిడి' ధోరణి 2029లో తమకు కలిసి వస్తుందని వైసీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో సైలెంట్ అయిన నేతలు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో బలమైన నేతలుగా ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తిరిగి వైసీపీలో క్రియాశీలకం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2024 డిసెంబర్లో వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్, ఆ తర్వాత టీడీపీ లేదా జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే అక్కడ సరైన సంకేతాలు రాకపోవడంతో, ఆయన తిరిగి 'ఫ్యాన్' నీడకే రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, వీరిద్దరి చేరిక విశాఖ జిల్లాలో వైసీపీకి కొత్త బలాన్నిస్తుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో వ్యాపారాలు, ఇతర కారణాలతో తెరమరుగైన నేతలు ఇప్పుడు వైసీపీ భవిష్యత్తుపై ధీమాతో మళ్లీ పార్టీ వైపు అడుగులు వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Share