నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు. వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడైన సాయితేజ, చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నారు. 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలవడం చూసి స్ఫూర్తి పొందిన ఆయన, ఎలాగైనా ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొడుకు ఆశయాన్ని గుర్తించిన తండ్రి, తన ఉద్యోగ బాధ్యతలను సైతం పక్కన పెట్టి సాయితేజకు అండగా నిలిచారు. సాయితేజ క్రికెట్ శిక్షణలో హైదరాబాద్‌లోని వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ కఠిన శిక్షణ పొందిన ఆయన, తన అద్భుత ప్రతిభతో 2022లో 18 ఏళ్ల వయసులోనే యూఎస్‌ఏ జాతీయ జట్టులో స్థానం సంపాదించారు. అతి చిన్న వయసులోనే అమెరికా తరఫున వన్డే సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లోనూ అమెరికా టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీమ్ ఇండియాతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సాయితేజ అమెరికా తరఫున బరిలోకి దిగడం విశేషం. ఒక తెలుగు యువకుడు అగ్రరాజ్యం తరఫున ఆడుతూ, ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కోవడంపై నంద్యాల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Share