Current Date: 25 Jun, 2026

అగర్వాల్ లోయలో జారిపడటం ప్రమాదం కాదు పక్కా ప్లాన్.. కాబోయే భార్యే విలన్!

మహారాష్ట్రలోని పుణే సమీపంలో గల లోహగఢ్ కోటపై ట్రెకింగ్కు వెళ్లిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. మొదట ప్రమాదవ శాత్తు లోయలో పడి జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన, అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి చేసిన పక్కా ప్లాన్ హత్యగా తేలింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేయడంతో, పెళ్లిని అడ్డుకోవడానికి వారు రచించిన కుట్రకు సంబంధించిన షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్, సియాలకు రాబోయే నవంబర్ నెలలో రాజస్థాన్లోని ఒక ప్రముఖ ప్యాలెస్ దాదాపు 17 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఈ పెళ్లి ఇష్టం లేని సియా, తన ప్రియుడు చేతన్తో కలిసి కేతన్ ను శాశ్వతంగా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వారు మొదట ఇండోనేషియాలోని బాలికి ప్రీ-వెడ్డింగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. అయితే విదేశాల్లో కంటే స్థానికంగానే హతమార్చడం సులువని భావించిన సియా, ముంబై ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గంలో ఒక హోటల్ వద్ద ఆగిన సమయంలో కేతన్ పాస్పోర్టును ఎవరికీ తెలియకుండా దొంగిలించి దాచేసింది. ఎయిర్పోర్టుకు చేరుకున్నాక పాస్పోర్ట్ కనిపించకపోవడంతో బాలి ప్రయాణం రద్దయింది. ఇలా పక్కా ప్రణాళికతోనే ఆమె బాలి ట్రిప్ను క్యాన్సిల్ చేసింది. బాలి ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో, జూన్ 14న సియా తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్ ను మొదటిసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లింది. అక్కడ అతనిని లోయలోకి నెట్టేయడానికి ప్రయత్నించగా, కేతన్ అదృష్టవశాత్తు పొదలను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమ యంలో అక్కడ పాము వచ్చిందని, అతనిని కాపాడటానికే నెట్టానంటూసియా నమ్మించింది. ఆ తర్వాత జూన్ 18న మళ్లీ అదే కోటకు కేతను ఒప్పించి తీసుకువెళ్లింది. ఈసారి ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కూడా రహ స్యంగా వారిని అనుసరించాడు. కోటపై ఒక నిర్మానుష్య ప్రాంతంలో కేతన్ ఫొటోలు దిగుతున్న సమయంలో, సియా, చేతన్ ఇద్దరూ కలిసిఅతనిని 400 అడుగుల లోతున్న లోయలోకి నెట్టి చంపేశారు. అనంతరం ఏమీ తెలియ నట్టు, బలమైన గాలులవల్ల కేతన్ కాలు జారి కింద పడిపోయాడంటూ పోలీసు లకు కథ అల్లారు. అంత్యక్రియలుముగిసిన తర్వాత సియా ప్రవర్తనపై కేతన్ కుటుంబ సభ్యులకు, అతని సోదరికి బలమైన అనుమానాలు వచ్చాయి. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పుణే రూరల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. సియా మొబైల్ ఫోన్ రికార్డులను పరిశీలించగా, ఆమె చేతన్చౌదరితో వేల సంఖ్యలో కాల్స్ మాట్లాడినట్లు, ఘటన జరిగిన సమయంలో చేతన్ లొకేషన్ కూడా అదే కోట పరిసరాల్లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితులు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. తమ ప్రేమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే కేతను అంతమొందించినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు వీరిని రిమాండ్కు తరలించారు.