దంపతుల మధ్య తలెత్తిన కలహాలు చివరకు ఐదేళ్ల చిన్నారి ప్రాణాలనే బలి తీసుకున్నాయి. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మర్రిగూడేనికి చెందిన పూనెం నాగేంద్రబాబు, కుమారి దంపతుల మధ్య విభేదాలు రావడంతో, భర్తను భయపెట్టాలని భార్య కూల్డ్రింక్ సీసాలో పురుగుల మందు తెచ్చి ఇంటి ఆవరణలో ఉంచింది. ఆ విషయాన్ని గమనించని వారి ఐదేళ్ల కుమార్తె రితిక, అది కూల్డ్రింక్ అనుకొని తాగడంతో పరిస్థితి విషమించింది. బాలిక ఏడవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు బాలికను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. అభం శుభం తెలియని చిన్నారి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల మధ్య ఉన్న మనస్పర్థలే ఈ దారుణానికి కారణమని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. ఒక చిన్న పొరపాటు, క్షణికావేశం పసిపాప ప్రాణాలను బలిగొనడం అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.