టీ20 ప్రపంచకప్-2026 విజయోత్సాహంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌పై భారత్ గెలిచిన చారిత్రాత్మక క్షణాలను ధోని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా గంభీర్ ముఖంలోని చిరునవ్వును ఉద్దేశించి ధోని ప్రశంసలు కురిపిస్తూ.. "కోచ్ సాహెబ్, మీ గంభీరమైన ముఖంలో ఆ నవ్వు ఒక కిల్లర్ కాంబో" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ధోని చేసిన ఈ వ్యాఖ్యలపై గంభీర్ తాజాగా స్పందిస్తూ తన మనసులోని కోరికను బయటపెట్టారు. భవిష్యత్తులో ధోని కూడా తనలాగే టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టాలని, కోచ్ హోదాలో ధోని ఐసీసీ ట్రోఫీని గెలిచినప్పుడు తాను కూడా అదే తరహాలో పోస్ట్ పెట్టాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ధోని డగౌట్లో కూర్చుని విజయాన్ని ఆస్వాదిస్తూ నవ్వడం చూడాలని ఉందంటూ గంభీర్ ఆకాంక్షించారు. ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో గంభీర్ కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు గంభీర్ కోచింగ్‌లో భారత్ వరుసగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లను కైవసం చేసుకుంది. సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన తరుణంలో, ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య సాగిన ఈ స్నేహపూర్వక సంభాషణ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.
Share