కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వానంగా మారాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రులకు ఎందుకు తరలించలేదు? స్కూల్ బెంచ్లపై వైద్యం చేస్తారా? అని ప్రశ్నించారు. గుర్లలో డయేరియా బాధితులను జగన్ గురువారం పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం గుర్లలో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వైసీపీ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం. గ్రామాలను సస్యశ్యామలం చేశాం. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. ఈరోజు పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. మా హయంలో గ్రామ సచివాలయం ద్వారా సేవలు అందించాం. వివిధ శాఖలకు చెందిన సేవలు సత్వరమే అందించగలిగాం. అన్ని డిపార్టమెంట్ల సిబ్బంది అందుబాటులో ఉండేవారు. విలేజ్ క్లినిక్ల ద్వారా 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. విలేజ్ క్లినిక్లను పీహెచ్సీలతో అనుసంధానం చేశాం. ఏఎన్ఎంలు కనిపించేవారు. ప్రతీ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండేది. ప్రభుత్వం అలసత్వం కారణంగా గుర్లలో డయేరియాతో 14 మంది చనిపోయారు.
Share