దివంగత నటుడు కాంతారావు శతజయంతి వేడుకల్లో తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్ గురించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారనే అర్థం వచ్చేలా ఆయన వాడిన కొన్ని అనుచిత పదజాలంపై తమిళ చిత్ర పరిశ్రమతో పాటు ఎంజీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటులు విశాల్, నాజర్ వంటి వారు కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సీరియస్ కావడంతో వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ తన మాటల పట్ల హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు. "నేను ఎంజీఆర్ గారిని గొప్ప నటుడిగా, మహానుభావుడిగా, తమిళ ప్రజలకు దేవుడిలాంటి వ్యక్తిగా గౌరవిస్తాను. ఆయనను అవమానించాలనేది నా ఉద్దేశ్యం కాదు. నా మాటల వల్ల ఎవరి మనసైనా బాధపడి ఉంటే దయచేసి క్షమించండి" అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ నటుడైన రాజేంద్ర ప్రసాద్ ఇలా తరచూ ఏదో ఒక సందర్భంలో నోరు జారడం, ఆ తర్వాత వివాదం కావడంతో క్షమాపణలు చెప్పడం గమనార్హం. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ఏకంగా పక్క రాష్ట్రానికి చెందిన ఆరాధ్య నటుడిపై హేయమైన వ్యాఖ్యలు చేయడం, ఆపై చింతించడంపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.