తల్లిదండ్రుల సంరక్షణ కోసం దేశ చరిత్రలోనే సరికొత్త చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతోంది. ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026’ పేరుతో ఒక కీలక చట్టాన్ని తీసుకురానుంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు ఉద్యోగులు సైతం తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, వారి వేతనం నుండి కొంత మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా ఈ బిల్లును రూపొందించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న నేపథ్యంలో, వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించి వారిలో నైతిక బాధ్యత పెంపొందించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిబంధనల ప్రకారం, నిరాదరణకు గురైన తల్లిదండ్రులు జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవాలి. సదరు అధికారి విచారణ చేపట్టి, ఉద్యోగి వేతనంలో 15 శాతం లేదా రూ.10,000 (ఏది తక్కువైతే అది) భృతిగా నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియను దరఖాస్తు అందిన 60 రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జిల్లా స్థాయి అధికారి నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి వయోవృద్ధుల కమిషన్‌లో అప్పీలు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఒకరు మరణిస్తే ఆ భృతిని మరొకరికి అందజేస్తారు. ఇద్దరూ మరణించిన పక్షంలో, ఉద్యోగి తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోపు ఆ వేతన మినహాయింపు ఉత్తర్వులను రద్దు చేస్తారు. గ్రామాల్లో ఒంటరిగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ఈ చట్టం ఒక పెద్ద అండగా నిలవనుంది.
Share