రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. శ్రీకాకుళం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈనెల 9 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ వర్షన్‌పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఒక ఆసక్తికరమైన సందేహం నెలకొంది. థియేటర్లలో విడుదలైన సమయంలో జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రపై కొన్ని విమర్శలు రావడంతో మేకర్స్ కొన్ని సీన్లను తొలగించారు. ఆ తర్వాత మళ్లీ కొన్ని కొత్త సీన్లను జోడించి థియేటర్లలో ప్రదర్శించారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసరికి పాత సీన్లతో స్ట్రీమింగ్ చేస్తారా లేక కొత్త సీన్లు యాడ్ చేసిన వర్షన్‌ను తీసుకొస్తారా అనే దానిపై నెట్‌ఫ్లిక్స్ కానీ, చిత్రబృందం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత కొన్ని సీన్లు తీసేసి, 'నానా హైరానా' సాంగ్ నిడివి తగ్గించారు. తీరా ఓటీటీలోకి వచ్చేసరికి ఆ కట్ చేసిన సీన్లేవీ కనిపించలేదు. ఇప్పుడు 'పెద్ది' సినిమాకి కూడా అలాగే జరుగుతుందా? లేదా థియేటర్ కట్ కాకుండా అన్‌కట్ వర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తారా? అన్నదానిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.