మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి మూవీ వివాదంలో చిక్కుకుంది. గత వారం విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే.. ఈ మూవీలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా ఉన్న వివాదాస్పద సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు డిమాండ్ చేశారు. ఈ చిత్రంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని పాత్రను అత్యంత ప్రతికూల కోణంలో తీర్చిదిద్దడం పట్ల ఉపాధ్యాయ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు జిల్లా పరిషత్తు పాఠశాల పేరును నేరుగా ఉపయోగిస్తూ ఉపాధ్యాయులను, విద్యార్థులను చూపించడం బాధ్యతారాహిత్యమని తెలిపారు. ఆ పాత్రను కేవలం ఒక కల్పిత కథగా మాత్రమే కాకుండా, దాని వెనుక ఉన్న వాతావరణాన్ని ప్రత్యక్షంగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ తరహా చిత్రీకరణ ఉపాధ్యాయ వృత్తి పవిత్రతను, పాఠశాల విద్యా వ్యవస్థను తీవ్రంగా కించపరిచేలా ఉందన్నారు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న ఆ సన్నివేశాలను సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ.. ఈ వివాదంపై ఇరుముడి చిత్ర యూనిట్ మాత్రం ఇంకా స్పందించలేదు.
Share