ముంబయి లోకల్ రైలులో ఇద్దరు ప్రయాణికుల మధ్య తలెత్తిన చిన్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. అంధేరి - బోరీవలీ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. బయట భారీ వర్షం కురుస్తుండటంతో, రైలు తలుపులు తెరిచి ఉంచాలని ఒకరు, మూసివేయాలని మరొకరు పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ పెద్దదవ్వడంతో నిందితుడు సచిన్ రమేశ్ సువర్ణ తన బ్యాగులో ఉన్న కత్తిని తీసి, తోటి ప్రయాణికుల ముందే మయాంక్ లోహర్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్రంగా పొడవటంతో మయాంక్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం నిందితుడు బోరీవలీ స్టేషన్ సమీపిస్తుండగా కత్తి చూపిస్తూ రైలు నుంచి దూకి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న మయాంక్‌ను తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. సుమారు 400 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి చివరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.