టాలీవుడ్లో గత కొంతకాలంగా సరైన అవకాశాలు లేకపోయినా, ఏదైనా క్రేజీ ప్రాజెక్టు ప్రకటించగానే పూజా హెగ్డే పేరు వినిపించడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా శర్వానంద్ - శ్రీనువైట్ల కాంబినేషన్లో రాబోతున్న 'జార్జ్ కృష్ణ' సినిమాలో హీరోయిన్గా పూజా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరిదీ ఫ్రెష్ కాంబినేషన్ కావడంతో, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాతోనైనా ఆమె టాలీవుడ్లోకి రీ-ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి. కేవలం శర్వానంద్ సినిమానే కాకుండా, మరికొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లోనూ పూజా హెగ్డే పేరు ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్ - వెంకటేష్ కలయికలో రాబోతున్న సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం, అలాగే 'పెద్ది' సినిమాలో మరో ప్రత్యేక గీతం కోసం ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. వీటితో పాటు నాని - సుజీత్ కాంబినేషన్ లోని 'బ్లడీ రోమియో', వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమాల్లో కూడా ఆమె పేరు పరిశీలనలోకి వచ్చినట్లు కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే, ప్రతి పెద్ద సినిమాకు పూజా పేరు వినిపించడం, తీరా చూస్తే అది కేవలం పుకారుగానే మిగిలిపోవడం ఇటీవల కామన్ అయిపోయింది. "ఇదిగో తోక అంటే అదిగో పులి" అన్న చందంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో, ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొంది.