Current Date: 31 Mar, 2026

ఐపీఎల్ 2026లో ముంబయి బోణి.. కొత్త ట్రెండ్ మొదలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ శుభారంభం చేసింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. కెప్టెన్ రహానె, రఘువంశీ మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబయి బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో రాణించగా, బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఓపెనర్లు రోహిత్ శర్మ 78 పరుగులు, రికెల్టన్ 81 పరుగులు ఆరంభం నుంచే కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు కేవలం 11.2 ఓవర్లలోనే 148 పరుగుల విధ్వంసక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ అవుటైన తర్వాత సూర్యకుమార్, రికెల్టన్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా.. లక్ష్యం చిన్నది కావడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్య, నమన్ ధీర్ కలిసి 19.1 ఓవర్లలోనే జట్టును విజయతీరాలకు చేర్చారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు జరగగా.. రెండింటిలోనూ ఛేదనకు దిగిన జట్లే విజయం సాధించడం గమనార్హం.