Current Date: 26 Nov, 2024

రావికమతంలో బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం లోని రావికమతం మండల కేంద్రంలో  ఓ మూడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాచేపల్లి నానాజీకి చెందిన హార్డ్ వేర్ సామాన్లు విక్రయించే మూడు అంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఇనుప సామాన్లు,  2, 3 వ అంతస్తుల్లో ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి. మొదటి ఫ్లోర్ లో వెల్డింగ్ పనులు జరుగు తుండగా.. వాటి నుంచి వచ్చిన స్పార్క్ (తుంపర్లు ) ద్వారా ఈ అగ్ని ప్రమాదం జరి గి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రావికమతం అగ్నిమాపక సిబ్బంది తమ సకటంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. స్థానిక ఎస్ ఐ ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు. కాగా ప్రమాదం జరుగుతున్న సమయంలో బిల్డింగ్ లో ఒక వ్యక్తి ఉండిపోవడంతో కొంత ఆందోళన నెలకొంది. స్థానికులు చొరవ చూపి నిచ్చెన ద్వారా ఆతనిని బిల్లింగ్ వెనుక నుంచి సురక్షితంగా క్రిందికి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం లో ప్లాస్టిక్ సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. రెండో అంతస్తుకు కూడా మంటలు వ్యాపించడంతో చోడవరం నుంచి వచ్చిన మరో అగ్ని మాపక శకటం మంటలను అదుపు చేసింది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా షాప్ యజమాని కి భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

Share