ఇండియన్ ప్రిమియర్ లీగ్ 18 ఏళ్ల చరిత్రలో ఈసారి ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. 2026 సీజన్‌లో బరిలోకి దిగుతున్న మొత్తం పది జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గత 17 సీజన్లలో ఏదో ఒక జట్టుకు విదేశీ ఆటగాళ్లు సారద్యం వహించేవారు. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా దూరం కావడంతో, అతని స్థానంలో ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో లీగ్‌లోని అన్ని జట్ల పగ్గాలు మన దేశీ ఆటగాళ్ల చేతుల్లోకి వచ్చాయి. ఈ సీజన్‌లో ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ (CSK), హార్దిక్ పాండ్య (MI), శ్రేయస్ అయ్యర్ (PBKS), రిషబ్ పంత్ (LSG), శుభ్‌మన్ గిల్ (GT) వంటి స్టార్లు తమ జట్లను నడిపించనున్నారు. రాజస్థాన్ రాయల్స్ (RR) సారథిగా రియాన్ పరాగ్, ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్ కొత్త బాధ్యతల్లో కనిపించనున్నారు. గత సీజన్లలో విదేశీ కెప్టెన్ల ప్రభావం ఎక్కువగా ఉండేది, కానీ ఈసారి భారతీయ నాయకత్వ పటిమకు ఇది ఒక గొప్ప పరీక్షగా నిలవనుంది. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో 'మొత్తం మనోళ్లే' అన్న నినాదం మార్మోగుతోంది. 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు షేన్ వార్న్ (రాజస్థాన్) మినహా మిగిలిన వారంతా భారతీయులే ఉండేవారు. ఆ తర్వాత కాలంలో విదేశీ కెప్టెన్ల హవా పెరిగింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో భారతీయ కెప్టెన్లతో టోర్నీ జరగడం విశేషం. ఈ మార్పు భారత యువ క్రికెటర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, భవిష్యత్తు టీమ్ ఇండియా నాయకత్వానికి వేదికగా మారనుంది.
Share