రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేటలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. అంజనాద్రి నివాస్ కాలనీకి చెందిన హిమబిందు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని, తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి మృతి చెందడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని నెలలుగా ఆ పిల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆమె, తెల్లవారుజామున అది రోడ్డుపై ప్రాణాల్లేకుండా పడి ఉండటం చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది. పిల్లి మరణవార్త విన్న వెంటనే బాధతో ఇంట్లోకి వెళ్లిన హిమబిందు ఎలకల మందు తాగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మరణించింది. హిమబిందు తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం తాడ్‌బండ్ నుండి వచ్చి బడంగ్‌పేటలో స్థిరపడ్డారు. అల్లారుముద్దుగా పెరిగిన కుమార్తె ఇలా చిన్న కారణంతో ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పెంపుడు జంతువులపై ఉన్న మితిమీరిన ప్రేమ ప్రాణాపాయానికి దారితీయడం స్థానికంగా అందరినీ కలచివేసింది.
Share