క్రీడారంగంలో చిన్నపాటి బలహీనతలు కూడా భవిష్యత్తును దెబ్బతీస్తాయని టీమిండియా వెటరన్ స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ యజ్వేంద్ర చహల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ షోలో పాల్గొన్న ఆయన, తన కెరీర్‌ను గాడిలో పెట్టుకునేందుకు గత ఆరు నెలలుగా మద్యానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. 35 ఏళ్ల వయసులో శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం, జట్టులోని యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలవడమే తన లక్ష్యమని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని చహల్ స్పష్టం చేశారు. గత సీజన్లలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, గాయాల వల్ల తన పూర్తి స్థాయి ప్రతిభను చాటలేకపోయానని చహల్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేకేఆర్‌తో మ్యాచ్ తర్వాత పక్కటెముక, కాలివేలి కీలు విరగడంతో సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో ఆశించిన రీతిలో లెగ్ స్పిన్ వేయలేకపోయానని గుర్తు చేసుకున్నారు. గత ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో పంజాబ్ కింగ్స్ ఎదుర్కొన్న ఓటమిపై స్పందిస్తూ.. కీలక ఆల్ రౌండర్ మార్కో యాన్సెన్ దూరం కావడం తమను దెబ్బతీసిందని విశ్లేషించారు. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వాయిదా పడటం, అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం యాన్సెన్ స్వదేశానికి వెళ్లాల్సి రావడం జట్టుకు పెద్ద లోటుగా మారిందన్నారు. ఒకవేళ యాన్సెన్ తుది జట్టులో ఉండి ఉంటే ఖచ్చితంగా టైటిల్ గెలిచేవాళ్లమని, ప్రస్తుతం జట్టులో ఆత్మవిశ్వాసం మెండుగా ఉందని చహల్ పేర్కొన్నారు.
Share